అమరావతి: శాసనసభ్యుడిగా తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. వారి చేత ప్రొటెం స్పీకర్ చినఅప్పలనాయుడు ప్రమాణం చేయించారు. 

చంద్రబాబు తర్వాత డిప్యూటీ సిఎం ఆంజాద్ పాషా, పాముల పుష్పవాణి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత వరుసగా ప్రమాణ స్వీకారాలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సరిగ్గా 11.05 గంటలకు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు పార్టీ కండువాలను వేసుకుని రాగా, తెలుగుదేశం సభ్యులు పసుపు కండువాలు వేసుకుని వచ్చారు. 

ఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా, తాము ఎమ్మెల్యేలుగా 15వ అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా అన్నారు. దేశమంతటికీ ఆదర్శంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన ఉంటుందని ఆమె అన్నారు.

నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు చేరుకున్నారు.

ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ శాసనసభ్యులతో కలిసి మంగళవారం ఉదయం శాసనసభకు బయలుదేరారు. అసెంబ్లీకి బయలుదేరడానికి ముందు తన పార్టీ శాసనసభ్యులతో కలిసి చంద్రబాబు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న విషయం తెలిసిందే. తొలి రోజు మంగళవారం ప్రోటెం స్పీకర్ అప్పలనాయుడు శాసనసభ్యుల చేత ప్రమాణం చేయిస్తారు.