ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల్లో అవకతవకలు కొనసాగుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల్లో అవకతవకలు కొనసాగుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోలో మాస్ కాపీయింగ్ చోటుచేసుకుంది. ఇక్కడ ఉపాధ్యాయులే మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించారు. జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పక్కనే ఉన్న పామర్రు మండలం పసమర్రు జెడ్పీ పాఠశాల నుంచి ప్రశ్నలకు జవాబుల స్లిప్‌లు పంపుతున్నట్టుగా ఫిర్యాదులు అందాయి. 

దీంతో విద్యాశాఖ అధికారులు, పోలీసులు పసమర్రు జెడ్పీ స్కూల్‌కు చేరుకున్నారు. ఇవాళ జరుగుతున్న పరీక్షలోని ప్రశ్నలకు సమాధానాలను కొందరు ఉపాధ్యాయుల సెల్‌ఫోన్లలో గుర్తించారు. దీనిపై డీఈవో పసమర్రు చేరుకుని విచారిస్తున్నారు. ఇక, మండవల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రం వచ్చినట్టుగా తెలుస్తోంది. 

పసుమర్రు హైస్కూల్ నుంచి ప్రశ్నలకు సమాధానాలు వెళ్తున్నాయని టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం వచ్చిందని డీఈవో తాహిరా సుల్తానా చెప్పారు. నలుగురు టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు మాల్ ప్రాక్టీస్‌‌కు పాల్పడినట్టుగా గుర్తించామని తెలిపారు. పసమర్రు స్కూల్‌కు ఎగ్జామ్ సెంటర్ లేదని.. ఇక్కడి విద్యార్థులు డోకిపర్రులో పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. విచారణ తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.