హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ పార్లమెంటు సభ్యుడు, సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. రాయపాటి ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఆంధ్రా బ్యాంక్ గురువారం ఓ ప్రటనలో తెలిపింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. 

రూ.837.37 కోట్ల విలువైన అప్పులు చెల్లించకపోవడంతో గుంటూరు, న్యూఢిల్లీల్లో ఉన్న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ తెలిపింది. గుంటూరులోని ఆరండల్ పేటలో గల 22,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వాణిజ్య భవనాన్ని, న్యూఢిల్లీలోని ఫ్లాట్ ను వేలు వేస్తున్నట్లు తెలిపింది. 

మార్చి 23వ తేదీన రాయపాటి ఆస్తులను వేలం వేయనున్నట్లు తెలిపింది. అయితే, వేలం వేసే ఆస్తుల విలువకు, రుణానికి మధ్య పొంతన లేదని తెలుస్తోంది. గుంటూరులోని ఆస్తి విలువ రూ.16.44 కోట్లుగాను, ఢిల్లీలోని ఫ్లాట్ ను రూ.1.09 కోట్లకు గాను వేలం వేయాలని నిర్ణయించినట్లు తెలుసతోంది. 

రాయపాటి ఆంధ్రాబ్యాంక్ నుంచి ట్రాన్స్ ట్రాయ్ ఇండియా కంపెనీ పేరుతో పాటు, మల్లినేని సాంబశివ రావు, రాయపాటి రంగారావు, చెరుకూరి శ్రీధర్, దేవికారాణి, లక్ష్మి పేర్లతో రుణాలు తీసుకున్నారు.

ఆ రుణానికి నారయ్య చౌదరి, రంగారావు, దేవికారాణి, రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, లక్ష్మి, జగన్ మోహన్ యలమంచిలి, సిహెచ్ వాణి పూచీకత్తుగా ఉన్నారు. ఈ వేలానికి సంబంధించిన వివరాల కోసం ఆంధ్రా బ్యాంక్ వెబ్ సైట్ లేదా టెండర్స్ డాట్ జీవోవీ ఇన్ ను సంప్రదించాలని సూచించింది.