వాషిం‍గ్టన్‌ : అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఈ సందర్భంగా డల్లాస్ ఎయిర్ పోర్టులో ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. జై జగన్ అనే నినాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారిగా మార్మోగిపోయింది. 

డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో భారత రాయబార కార్యాలయ సీనియర్‌ అధికారులు అరుణీశ్‌ చావ్లా‌(ఐఏఎస్‌), నీల్‌కాంత్‌ అవ్హద్‌(ఐఏఎస్‌)లు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. సీఎం జగన్‌ పర్యటనకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు.  

ఆగష్టు 16 రాత్రి అమెరికా రాయబారితో, అమెరికా-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అనంతరం అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.  

ఇకపోతే ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్‌ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్‌ అమెరికాలోని ప్రవాసాంద్ర మహాసభలో పాల్గొని జగన్ ప్రసంగిస్తారు.  

అదేరోజు ఆగస్టు 18న వాషింగ్టన్‌ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనుల్లో బిజీబిజీగా గడపనున్నారు. ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారు. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డిలు ఉన్నారు.