అనంతపురం: ఏపీలో ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడనే లేదు. కానీ రాజకీయాలు మాత్రం శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ఆయా రాజకీయ నేతలు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. 

కొందరు రాజ‌కీయ నాయ‌కులు అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి మూటా ముళ్లు స‌ర్దుకుని ఆపార్టీలోకి చేరేందుకు నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపోతే ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు వెల్లడవుతున్నాయి. 

ఈ పరిణామాల నేపథ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలువురు టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్లాట్ ఫాం రెడీ చేసుకుంటున్నారట. పక్కా గెలుస్తామని ధీమాతో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు వైసీపీలో చేరేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నారట. 

ఫలితాలు వెలువడక ముందు చేరాలా లేక ఫలితాలు వెలువడిన తర్వాత చేరాలా అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేక దృష్టిసారించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే టీడీపీ నేతల జాబితాను టీడీపీ అధిష్టానం ముందుంచినట్లు సమాచారం. 

అయితే ఎవరు పార్టీ మారతారో వారికి టీడీపీ అధిష్టానం నేరుగా ఫోన్ చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న వారిలో టీడీపీ ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి. 

ఈయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం ఎంపీ, రాజకీయ కురువృద్ధుడు జేసీ దివాకర్ తనయుడైన జేసీ పవన్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకు మెంటల్ గా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. 

జేసీ పవన్ కుమార్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కుటుంబానికి సత్సమసంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. అయితే 2014 ఎన్నికలకు ముందు జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. 

దీంతో జేసీ పవన్ కుమార్ రెడ్డి సైతం తండ్రిచాటున తనయుడిగా టీడీపీలో కొనసాగారు. 2019 ఎన్నికల్లో జేసీ పోటీ నుంచి విరమించుకున్న నేపథ్యంలో ఆయన తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని అనంతపురం లోక్ సభ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించారు. 

జేసీ పవన్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జేసీ పవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా టీడీపీ శిబిరంలో కలవరం రేపుతున్నాయి. మరి జేసీ పవన్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరతారా లేక ప్రచారమా అన్నది తెలియాల్సి ఉంది. జేసీ పవన్ తోపాటు చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.  

అయితే వైఎస్ జగన్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడంతో వారంతా టీడీపీలో చేరిపోయారు. దాదాపు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు సైకిలెక్కేశారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేశారు. అసెంబ్లీలో న్యాయం జరగకపోవడంతో ప్రజల మధ్యే తేల్చుకుందామని డిసైడ్ అయిన  జగన్ ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు. ఫిరాయింపులపై ఇంతటి అలుపెరగని పోరాటం చేసిన జగన్ మరి ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.