అనంతపురం: అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన శివ అనే వ్యక్తిపై దాడి కేసును చేధించారు పోలీసులు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని నిర్ధారించారు. దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు అనంతపురం పోలీసులు. 

దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు శివ గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడని అయితే అదే అమ్మాయి ప్రస్తుతం భరత్ అనే యువకుడితో ప్రేమాయాణం సాగిస్తుందని పోలీసులు తెలిపారు. అమ్మాయి విషయంలో నెలకొన్న మనస్పర్థలే దాడికి ప్రధాన కారణమని తమ విచారణలో తేలినట్లు తెలిపారు. 

ఆర్ట్స్ కళాశాలలో జరిగిన దాడి విద్యార్థులకు సంబంధం లేదన్నారు. అది బయటి వ్యవహారమని నిందితులు గానీ బాధితుడు గానీ ఎవరూ విద్యార్థులు కారన్నారు. బాధితుడు శివ నవోదయ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడని తెలిపారు. 

నిందితుడు భరత్  కూడేరులో ఒక హోటల్ వ్యాపారి అంటూ చెప్పుకొచ్చారు. శివ, భరత్ ఇద్దరూ పదో తరగతి వరకు చదువుకున్నారని తెలిపారు. ప్రేమ వ్యవహారంపై ఇద్దరు మధ్య వాగ్వాదం చెలరేగిందని తెలిపారు. 

భరత్, శివ ఇద్దరికి స్నేహితుడు రాజేశ్. వీరిద్దరి మధ్య సయోధ్యకు కుదురుస్తున్నాడు రాజేశ్. అయితే అమ్మాయి విషయంలో మళ్లీ గొడవ రావడంతో తేల్చుకుందాం రమ్మనంటూ శివకు రాజేశ్ తో కబురు పంపాడు. 

దీంతో ఈనెల 25న కళాశాల వద్ద శివ ఒంటరిగా ఉండగా భరత్ తన గ్యాంగ్ తో అక్కడికి వెళ్లాడు. శివపై విచక్షణారహితంగా దాడి చేశారు. బెల్ట్, రాళ్లతో విరుచుకుపడ్డారు. హత్యాప్రయత్నం చేశారు. ఈ దాడిలో శివ తీవ్రగాయాలపాలవ్వడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. 

ఇకపోతే నిందితులు భరత్ గ్యాంగ్ పై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు. వారిపై నిత్యం నిఘాపెడతామని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. నగరంలో ఎలాంటి దాడులు జరిగినా, సంఘ విద్రోహక చర్యలు  జరిగినా తమకు సమాచారం అందివ్వాలని పోలీసులు కోరారు.