విషాదం… పుట్టినరోజే మృత్యుఒడికి చేరిన చిన్నారి..
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ఎలా పొంచి వస్తుందో ఎవరికీ తెలియదు. దాని ఆపడం కూడా ఎవరి తరం కాదు. ఓ చిన్నారి పుట్టిన రోజు నాడే ఊహించని విధంగా మృత్యుఒడిలోకి చేరింది.

తమ చిన్నారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుదామని ఆ కుటుంబం అనుకుంది. ఈ క్రమంలో పాఠశాలలో తోటి విద్యార్ధులకు చాక్లెట్లు పంచి తన బర్త్ డే పార్టీకి రావాలని ఆహ్వానించింది ఆ చిన్నారి. కానీ ఎవరూ ఊహించని విధంగా మృత్యువు ఆ చిన్నారి ప్రాణాలు తీసుకుంది. పుట్టిన రోజు నాడే చిన్నారిపై బండ రాయి (నాపరాయి) మీద పడటంతో మృత్యువాత పడింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లు పట్టణంలోని అంకాలమ్మ వీధిలో శిరీష, రంగా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతుల కీర్తన అనే నాలుగేండ్ల కుతూరు ఉంది. ఆ చిన్నారి స్థానికంగా శ్రీ విద్య ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో యూకేజీ చదువుతోంది.
శుక్రవారం ఆ చిన్నారి తన ఐదో పుట్టినరోజు. తన పుట్టిన రోజు వేడుకలకు తన తోటి చిన్నారులను రావాలని ఆహ్వానించింది. వారి చాక్లెట్లు పంచి.. చాలా సంతోషంగా గడిపింది. ఆ తర్వాత అలసిపోయిన ఆ చిన్నారి తన తరగతి గదిలోనే పడుకుంది.
ఆ చిన్నారి నిద్రపోతున్న సమయంలో తరగతి గదిలో ఉన్న నాపరాయి ఆమె మీద పడింది. తీవ్రంగా గాయపడి, రక్తమోడుతున్న చిన్నారిని హుటాహూటిన గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ చిన్నారి అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అప్పటిదాకా.. ఆనందంగా గడిపిన తమ చిన్నారిని విగతజీవిగా మారడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
పాఠశాల నిర్వాహకులు నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి మృతి చెందిందని ఆ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు అతిక్రమంగా నడుపుతున్న పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు.
అసలేం జరిగిందంటే?
తరగతి గదికి మూడు వైపులా నాపరాయి బండలతో ప్రహరి గోడను ఏర్పాటు చేశారు. అయితే.. విరామ సమయంలో ఆకతాయి చిన్నారులు ఆ గోడ అవతలి వైపు నుంచి బండరాయిని బలంగా తాకారని, ఆ బండరాయి చిన్నారిపై పడిందని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. చిన్నారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.