Asianet News TeluguAsianet News Telugu

సామూహిక ఆత్మహత్యలే దిక్కా... ఇదీ అనంతపురం అన్నదాతల దుస్థితి: లోకేష్ సీరియస్ (వీడియో)

అనంతపురం జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని... వైసిపి నేతలు దౌర్జన్యంగా అమాయక రైతుల భూములను కబ్జా చేస్తున్నారని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

anantapur farmer family suicide attempt... nara lokesh serious on ycp government
Author
Anantapur, First Published Oct 5, 2021, 1:40 PM IST

అనంతపురం (Anantapur): తనకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే వ్యవసాయ భూమిలో జేసిబితో నీటికాలువ తవ్వారని అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వయంగా మంత్రి శంకరనారాయణ (Shankar Narayana) అనుచరులు తనను బెదిరించి దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ బాధిత రైతు సెల్పీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై టిడిపి (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. 

''జగన్ రెడ్డి చెత్త పాలనలో  రోజుకో రైతు న్యాయం చెయ్యండంటూ రోడ్డెక్కాల్సిన దుస్థితి. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం రాజుపాలెం గ్రామంలో నష్టపరిహారం ఇవ్వకుండానే రైతు వేమారెడ్డి భూమి లాక్కొని స్వయంగా మంత్రి అనుచరులే జేసీబీలతో దౌర్జన్యంగా గండి కొట్టి పొలాలు మీదుగా నీటిని మళ్లించడం దారుణం. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి. రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం చెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.

వీడియో

అంతకుముందు ఇదే అనంతపురం జిల్లాలో ఓ రైతు కుటుంబం తమ జీవనాధారం అయిన వ్యవసాయ భూమిని కబ్జా చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపైనా లోకేష్ స్పందించారు. వైసీపీ నేతలు,  కొంతమంది అధికారులే ఈ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి కారణమని లోకేష్ మండిపడ్డారు. 

''వైసీపీ నాయకుల భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అనంతపురం జిల్లా అక్కంపల్లికి చెందిన రైతు లక్ష్మీరెడ్డి గారి కుటుంబం మొత్తం వారికి జీవనమైన పొలంలోనే ఆత్మహత్యాయత్నం చేసారంటే వైసీపీ దుర్మార్గుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోంది'' అన్నారు.

''వైసీపీ నేతలు స్థానికంగా ఉన్న కొంతమంది అధికారులు కుమ్మకై రైతు భూమి కొట్టేయ్యాలని కుట్రలు చెయ్యడం దారుణం. దీని వెనుక ఉన్న అసలు సూత్రదారులను శిక్షించి రైతు లక్ష్మీరెడ్డి కుటుంబానికి న్యాయం చెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios