కృష్ణ‌ప‌ట్నం: కరోనాను తరిమికొట్టాలన్న తన ప్రయత్నానికి సహకారం అందించాలంటూ సీఎం జగన్ ను కోరారు ఆనందయ్య. ఈ మేరకు తనకు కావాల్సిన సహకారంతో, మందు తయారీ కోసం సదుపాయాల గురించి పేర్కొంటూ సీఎంకు లేఖ రాశారు ఆనందయ్య. 

ఎక్కువ మొత్తంలో మందు తయారుచేసి రాష్ట్ర ప్రజలకే కాదు ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా అందించాలని భావిస్తున్నాను. అందుకోసం ఔషద తయారీకి ఉపయోగించే సామాగ్రిని సమకూర్చండి. అలాగే విద్యుత్ సౌకర్యం కలిగిన కేంద్రాన్ని ఏర్పాటుచేయండి'' అని ఆనందయ్య సీఎం జగన్ ను కోరారు.

read more  ఆనందయ్య మందుపై విమర్శలు: సోమిరెడ్డిపై కేసు నమోదు

ఇక తాను తయారు చేసే మందుకు కేవలం ప్రభుత్వం నుంచి అనుమతులే వున్నాయని.... ఎలాంటి సహకారం లేదని ఆనందయ్య తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధాన్ని అందిస్తానని స్పష్టం చేశారు. 

''కొన్ని ఆటంకాల వల్ల ఔషధ పంపీణీ సవ్యంగా సాగట్లేదు. పంపిణీకి సరపడా వనరులు సమకూరడం లేదు. విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీకి యంత్ర సామాగ్రి లేదు. కాబట్టి భారీమొత్తంలో ఔషదాన్ని తయారుచేయడం సాధ్యపడటం లేదు'' అని ఆనందయ్య పేర్కొన్నారు. 

ఇదిలావుంటే ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందుపై విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు తన తీర్పును సోమవారం నాటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మందుపై సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. 

ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందును కె మందుగా పిలుస్తున్నారు. కంట్లో వేసే చుక్కల మందుకు వెంటనే అనుమతి ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మందును తక్షణమే బాధితులకు పంపిణీ చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. కె మందుపై రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వం ఆదేశించింది.