నెల్లూరు: బొనిగె ఆనందయ్య ఇస్తున్న కరోనా ఆయుర్వేద మందుపై ఐసిఎంఆర్ పరీక్షలు జరిపే అవకాశం లేదని తెలుస్తోంది. మందును పరిశీలించడాని ఐసిఎంఆర్ బృందం నెల్లూరు జిల్లాకు వస్తుందని ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. అయితే, ఐసిఎంఆర్ అందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. బొనిగే ఆనందయ్య మందును పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే కాకుండా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఐసిఎంఆర్ కు సూచించారు. 

ఈ స్థితిలో బొనిగె ఆనందయ్య ఇస్తున్న మందు పరిశీలనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ (సీసీఆర్ఎఎస్) రంగంలోకి దిగింది. ఆనందయ్య ఇస్తున్న మందు ఆయుర్వేదమా, కాదా అనే విషయాన్ని ఆ సంస్థ తేలుస్తుందని అంటున్నారు. ఆయుష్ అధికారులు జరిపిన పరిశోధనలను ఢిల్లీ అధికారులకు పంపించారు 

ఆయుష్ బృందం ఆనందయ్య ఇస్తున్న మందును నాలుగు దశల్లో పరిశీలించింది. ఈ పరిశీలన తర్వాత ఆయుష్ కమిషనర్ రాములు మందుపై స్పందించారు. ఆనందయ్య ఇస్తున్న మందు హానికరం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే అది ఆయుర్వేదం కాదని, నాటు మందు మాత్రమేనని చెప్పారు. అయితే, బొనిగె ఆనందయ్య ఆ వాదనతో విభేదించారు. తన మందు ఆయుర్వేదమేనని ఆయన చెప్పారు దాదాపు 60 వేల మంది ఆనందయ్య మందు తీసుకున్నారని, వారంతా కోలుకున్నారని, సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పారని తేల్చారు. 

ఆయుష్ విభాగం తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదికను అందుకున్న తర్వాత మందు పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆనందయ్య మందుకు అనుకూలంగానే మాట్లాడారు. ఆనందయ్య మందును పంపిణీపై జగన్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. 

కరోనాకు నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య మందు ఇస్తూ వచ్చారు. ఆయన ఇస్తున్న మందుపై విస్తృతమైన ప్రచారం జరగడంతో కృష్ణపట్నానికి వేలాదిగా ప్రజలు రావడం ప్రారంభమైంది. ఆయన మందు కోసం తోపులాట కూడా జరిగింది. ఈ స్థితిలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. 

కోటయ్య అనే స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కోటయ్య మందుతో తన ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్స్ పెరిగాయని ఆయన చెప్పారు. దాంతో తాను పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. అయితే, ఆ తర్వాత అది వికటించి, కోటయ్య అస్పత్రిలో చేరారని ప్రచారం సాగింది. అయితే, అది నిజం కాదని ఆ తర్వాత తేలింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు విశ్వసనీయత పెరిగింది.