విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో విలువలు లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఘాటుగా విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా విశాఖపట్నం చేరుకున్న ఆయనకు పార్టీనేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అవంతి శ్రీనివాస్ విలువల గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసం తాను పార్టీ మారలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబును ఎన్నడూ ఎంపీ సీటు అడగలేదని తాను భీమిలీ అసెంబ్లీ సీటు అడిగితే ఎంపీగా ఎందుకు పంపించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే భయపడనని అలాంటిది చంద్రబాబుకు భయపడతానా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం బలాన్ని చూసి భయపడ్డ చంద్రబాబు వైసీపీ నుంచి గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి రాజకీయాలను భ్రష్టుపట్టించారంటూ ధ్వజమెత్తారు.  

మరోవైపు ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ కు వార్నింగ్ ఇచ్చారు అవంతి శ్రీనివాస్. చంద్రబాబు తనకు రోల్‌ మోడల్ అని చెప్పుకునే మంత్రి గంటా శ్రీనివాసరావు మాటలు వాస్తవమేనన్నారు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబే మంత్రి గంటాకు ఆదర్శమన్నారు. దయచేసి మంత్రి గంటా తన జోలికి రావద్దొని హెచ్చరించారు. ఇక నుంచి మీ పని మీరు చేసుకోండి...నా పని నేను చేసుకుంటాను అని అవంతి శ్రీనివాస్‌ హితవు పలికారు.