వారి ఆకలికేకలు జగన్ కు వినిపించవా...? అమర్త్యసేన్ ఏమన్నాడంటే..: అనగాని ఆవేదన

లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల ఆకలిబాధలు ముఖ్యమంత్రి జగన్ కు వినిపించడం లేదా అని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. 

Anagani Satyaprasad fires on AP  CM YS Jagan

గుంటూరు: ఓవైపు కరోనా విజృంభణ మరోవైపు లాక్ డౌన్ విధించడంతో ఏపీలోని పేద‌లంద‌రు ఆకలిబాధతో అలమటిస్తున్నారని... వారిని అక్కున చేర్చుకొని త‌‌క్షణ సాయం అందించ‌క‌పోతే  ఆఫ్రికా దేశాల్లోని సోమాలియా మాదిరిగా ఆక‌లి చావులు చూడాల్సి వ‌స్తుందేమో? అని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 

అన్నపూర్ణాంధ్రప్రదేశ్ ప్రజ‌లు క‌డుపు నింపుకోవ‌డానికి పాట్లు ప‌డ‌టం ప్రభుత్వం చేత‌గాని త‌నానికి నిద‌ర్శనమని మండిపడ్డారు. పేద‌ల బాధ‌లు అందుడు సైతం చూడ‌గ‌ల‌డ‌ని నోబెల్ గ్రహీత అమ‌ర్త్యసేన్ అన్నాడని... కానీ ఈ రాష్ట్రంలో పేద‌ల ఆక‌లి కేక‌ల‌‌ ఆర్తనాధాలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి విన‌ప‌డ‌క‌పోవ‌డం సిగ్గుచేటని మండిపడ్డారు. 

''క‌రోనా వైర‌స్ నుంచి ప్రజ‌ల‌ను కాపాడేందుకు భార‌త ప్రధాని మార్చి 23 నుంచి లాక్ డౌన్ ను విధించారు. వైర‌స్ నియంత్రణ‌కు దేశ  ప్రజ‌లంద‌రు  సామాజిక దూరం పాటిస్తూ స్వచ్ఛంధంగా ఇళ్లకే ప‌రిమితం అవ్వటంతో అన్ని రంగాలు కుదేల‌య్యాయి. దీనితో రోజు గ‌డిస్తేగాని పూట గ‌డ‌వ‌ని పేద‌లు మ‌రింత ధీనావ‌స్థలో కూరుకుపోయారు. అస‌మ‌ర్ధ ప్రభుత్వానికి వీరిని ఆదుకునేందుకు చేతులు రావ‌డం లేదు'' అని అన్నారు.

''రైతులు, అసంఘ‌టి కార్మికులు, వ‌ల‌స కూలీలు, కుమ్మరి, క‌మ్మరి, చాక‌లి, గీత లాంటి రోజువారి కార్మికుల జీవితాలు మ‌రీ ద‌య‌నీయంగా మారింది. ముఖ్యంగా చేతి వృత్తి కార్మికుల బ్రతుకులు పాతాళంలోకి నెట్టివేయ‌బ‌డ్డాయి. పూట గ‌డ‌వని ప‌రిస్థితి. వైకాపా ప్రభుత్వం ఏ ఒక్క రంగాన్ని ఆదుకున్న ధాఖ‌లాలు లేవు. పైపెచ్చు క‌రోనా స‌మ‌యంలోను ఇసుక‌, మ‌ట్టి, మైనింగ్ దోచుకుంటున్నారు గాని పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టాల‌న్న ధ్యాసే వైకాపా నాయ‌కుల్లో క‌రువ‌య్యింది'' అని ఆరోపించారు. 

''తుగ్లక్ పాల‌న‌తో కృత్రిమ ఇసుక కొర‌త సృష్టించి ల‌క్షలాది మంది క‌డుపు కొట్టారు. ఇప్పుడు క‌రోనా స‌మ‌యంలోను ఆక‌లితో ఉన్న వారిని ప‌ట్టించుకోకుండా వారిని మ‌రింత క్షోభ పెడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్న చేతివృత్తి దారుల‌పై దాడులు చేయించిన ఏకైక ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రమే. పాలించ‌డం చేతగాని వారికి పాల‌నిస్తే ప‌రిస్థితి ఇలానే ఉంటుంద‌ని ప్రజ‌లు భావిస్తున్నారు'' అని అన్నారు. 

''జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి బీసీల‌కు వెన్నుపోటు పొడిచారు. రాజ‌కీయ క‌క్షతో అన్నా క్యాంటీన్లను మూయించారు.  ‘అన్నమో రామచంద్రా..’ అని నిరుపేదలు ఎదురుచూస్తుంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ట్టవన్నట్లుగా ప్రవ‌ర్తించ‌డం హేయం. ప్రతిప‌క్ష పార్టీలు సూచ‌న‌లు ఇస్తుంటే వైకాపా నాయ‌కులు రాజ‌కీయ దాడి చేస్తున్నారు. ఈ ప‌రిస్థితిని అదుపుచేయ‌డం చేత‌గాక, త‌మ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై దాడి చేస్తున్నారు. పేదలందరికి రూ. 5000 ఇచ్చి ఆదుకోవాలి  రైతులు, రోజు వారి కూలీలు, చేతి వృత్తిదారుల‌ను ఆదుకోవాలి, పేదల ఆకలి తీర్చటానికి అవసరమైన చర్యలు సత్వరమే చేపట్టాలి'' అని అనగాని సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios