అంబటి రాయుడును జగన్ గుంటూరుకు తెచ్చిపెట్టడంతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రగిలిపోతున్నారు. వేణుగోపాల్ రెడ్డిని అసెంబ్లీ బరిలో దింపాలని జగన్ ఏమైనా ఆలోచిస్తున్నారా..? లేక పూర్తిగా పక్కన పెట్టేశారా అన్నది తెలియరాలేదు. 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ సిట్టింగ్ మార్పిడి వ్యవహారం ఆ పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. ఆప్తులైనా, బంధువులైనా గెలవరు అని తెలిస్తే చాలు నిర్దాక్షిణ్యంగా పక్కనబెడుతున్నారు జగన్. వీరిలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా వున్నారు. ఈ మార్పులు చేర్పుల కార్యక్రమం మధ్యలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వచ్చి రాగానే ఆయనకు జగన్ బంపరాఫర్ కూడా ఇచ్చారట. అదే గుంటూరు లోక్‌సభ స్థానం. జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా మంచి ఫాలోయింగ్ వున్న అంబటి రాయుడును లోక్‌సభకు పంపడమే కరెక్ట్ అని జగన్ భావించినట్లున్నారు. దీనికి తోడు ఆర్ధికంగా, సామాజికంగా అంబటి రాయుడు బలమైన వ్యక్తి కావడంతో గుంటూరుకు కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. గుంటూరు లోక్‌సభపై సీనియర్ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ ఎంపీగా గెలిచిన ఆయన , గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగానూ పనిచేశారు. తదనంతర కాలంలో వైసీపీలో చేరి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా వుంటున్నారు మోదుగుల. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ వుండటంతో తిరిగి యాక్టీవ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈలోగా అంబటి రాయుడును జగన్ గుంటూరుకు తెచ్చిపెట్టడంతో మోదుగుల రగిలిపోతున్నారు. 

గుంటూరు లోక్‌సభకు అంబటిని పంపినట్లుగా జగన్ సంకేతాలు మాత్రమే ఇచ్చారా లేక కన్ఫర్మ్ చేసేశారా అన్నది తేల్చుకునే పనిలో వేణుగోపాల్ రెడ్డి వున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం వుంది. వేణుగోపాల్ రెడ్డిని అసెంబ్లీ బరిలో దింపాలని జగన్ ఏమైనా ఆలోచిస్తున్నారా..? లేక పూర్తిగా పక్కన పెట్టేశారా అన్నది తెలియరాలేదు. ఒకవేళ అదే జరిగితే మోదుగుల భవిష్యత్ ప్రశ్నార్ధకమే. ఎందుకంటే టీడీపీ మళ్లీ రానిచ్చే ఛాన్స్ లేదు.. వైసీపీలో దారితెన్నూ లేదు. మరి మోదుగుల వాట్ నెక్ట్స్.