ఇటీవలే వైసీపీలో చేరిన టీమీండియా మాజీ కెప్టెన్ అంబటి రాయుడు పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ట్వీట్ చేశారు. 

అమరావతి : ఇటీవలే వైసీపీలో చేరిన టీమీండియా మాజీ కెప్టెన్ అంబటి రాయుడు పార్టీ నుంచి తప్పుకోనున్నట్లు ట్వీట్ చేశారు. పదిరోజుల క్రితమే అంబటి రాయుడు పార్టీలో చేరారు. అంతలోనే పార్టీని వీడుతున్నట్లు ట్వీట్ చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగాఉంటానన్నా రాయుడు, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ట్వీట్ చేశారు.

అంబటిరాయుడు డిసెంబర్ 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి జగన్. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. 

రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు తెలిపారు. పార్టీలో చేరడానికి ముందునుంచే వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. టీమిండియాకు, ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత రాయుడు పలుమార్లు సీఎం జగన్‌ను కలిశారు. అప్పుడే ఆయన పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరిగింది. కానీ అంబటి రాయుడు మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

అయినప్పటికీ గుంటూరు జిల్లాలో విస్త్రతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు రాయుడు. ఈ నేపథ్యంలో ఇవాళ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. వైసీపీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాయుడిని గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయించే అవకాశాలు వున్నాయి. దీనిపై జగన్ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తరువాత పార్టీలో చేరాక గుంటూరు నుంచి టికెట్ ఇస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, అనూహ్యంగా ఇప్పుడు ఈ ట్వీట్ కలకలంగా మారింది. 

అంబటి రాయుడు కోరుకున్న హామీలు దక్కలేదా? లేక టికెట్ విషయంలో అసంతృప్తితో ఉన్నారా? అంబటి రాయుడు ఆశించిన స్తానంలో వేరేవారిని అధిష్టానం వెతుకుతోందా? ఎందుకు అంబటిరాయుడు రాజీనామా చేయాలనుకుంటున్నాడు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, అంబటి రాయుడు అందుబాటులో లేకపోవడంతో దీనిమీద క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. 

Scroll to load tweet…