విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఇటలీ దెయ్యం సోనియాను తరిమికొట్టాలని, రాహుల్ గాంధీ పప్పు అన్న చంద్రబాబు ఇప్పుడు ఎలా కలిశారని నిలదీశారు. రాజకీయ ఎత్తుగడ కోసమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ రెండుగా చీల్చిందని, విభజనతో రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని అంబటి అన్నారు. 

రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్ కాంగ్రెస్ ను తరిమికొట్టాలన్న చంద్రబాబు గురువారం రాహుల్‌ను కలవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కుట్ర, వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబు నైజం అంటూ అంబటి ధ్వజమెత్తారు. 

ఎన్టీఆర్‌ను దేవుడన్న చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మరీ ఆయన కూర్చీని లాక్కున్నారని, గతంలో ఓసారి మోదీని విమర్శించి మళ్లీ ఆయనతోనే చంద్రబాబు జత కట్టారని గుర్తుచేశారు. 

ప్రత్యేక హోదా అవసరం లేదన్న చంద్రబాబు ఆ తర్వాత యూటర్న్‌ తీసుకుని మళ్లీ హోదా కావాలన్నారని గుర్తు చేశారు. చంద్రబాబుది నాలుకా? తాటిమట్టా? అని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి బాగుపడ్డవారెవరూ లేరని అంబటి ఎద్దేవా చేశారు. 

ఆర్థిక సంబందాలే తప్ప మానవ సంబంధాలు లేని వ్యక్తి చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడైనా ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేశారా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్‌ దక్కదని సర్వేలు చెబుతున్నాయని అంబటి స్పష్టం చేశారు.