కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలు బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వీరంతా చంద్రబాబుతో 24 గంటలు టచ్‌లో ఉంటారని, ఆయనను కాపాడేందుకే బీజేపీలో ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు.

వీరిద్దరూ కమల వనంలో పచ్చ పుష్పాలని.. రమేశ్ కుమార్‌తో పార్క్‌హయత్‌లో గంటపాటు ఎందుకు చర్చించారని రాంబాబు ప్రశ్నించారు. ఎస్ఈసీ‌గా కొనసాగింపుపై హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసు వేసిన రమేశ్ కుమార్ ... లాయర్లకు ఫీజులు చెల్లించగలరా అని ఆయన నిలదీశారు.

ఆ డబ్బంతా చంద్రబాబు జేబులో డబ్బేనని ఆరోపించారు. వీరిద్దరూ కలిసి ఏం మాట్లాడుకున్నారన్న రాంబాబు... వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నారా అని నిలదీశారు.

రమేశ్ కుమార్ కోసమే కామినేని హైకోర్టులో పిటిషన్ వేశారని.. ఇద్దరి పిల్స్‌లో ఉన్న సారాంశం ఒక్కటేనని అంబటి ఆరోపించారు. రమేశ్‌ కుమార్‌ను తక్షణం అరెస్ట్ చేసి విచారించాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉందన్నారు.

ఉదయం నుంచి టీవీ ఛానెళ్లలో వస్తున్న వార్తలకు సంబంధించి ముగ్గురిలో ఏ ఒక్కరూ స్పందించడం లేదని తేలుకుట్టిన దొంగల్లా మాట్లాడలేకపోతున్నారని రాంబాబు ప్రశ్నించారు. బాధ్యత గల పదవిలో ఉంటూ రాజకీయ పార్టీల నేతలతో ఓ ప్రైవేట్ హోటల్‌లో భేటీ అవ్వాల్సిన అవసరం రమేశ్ కుమార్‌కు ఏంటని అంబటి నిలదీశారు.