అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలు పలువురు నేతలు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అమరావతి భూముల వ్యవహారంపై మంత్రి వర్గ ఉప సంఘం విచారణ జరిపి నివేదిక సమర్పించింది. భూముల అక్రమాల వ్యవహారంలో సంబంధం ఉన్న నేతల జాబితాను కూడా మంత్రివర్గం సమర్పించింది.

చంద్రబాబు, నారాయణలతో పాటు నేతలు పుట్టా మహేష్ యాదవ్, పరిటాల సునీత, లోకేష్, పయ్యావుల కేశవ్, వేమూరు రవికుమార్ ప్రసాద్, జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, లంకా దినకర్, లింగమనేని రమేష్, దూళిపాళ్ల నరేంద్ర చౌదరి, కంభంపాటి రామ్మోహన్ పేర్లను మంత్రివర్గ ఉపసంఘం అక్రమాలకు పాల్పడినవారంటూ తేల్చి చెప్పింది. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా సీఐడి కేసులు నమోదు చేసింది. 

Also Read: చంద్రబాబు మెడకు అమరావతి భూములు: ఏపీ సిఐడి నోటీసులు జారీ

రాజధాని నగరంలోనూ రాజధాని ప్రాంతంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు మంత్రివర్గం తేల్చింది. టీడీపీ నేతలకు, వారి బినామీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా జీవోలు జారీ అయ్యాయని చెప్పింది. రాజధాని ప్రకటన వెలువడడానికి ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోళ్లు చేశారని ఆరోపించింది. ఈ కొనుగోళ్లు 2014 జూన్ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు క్రయవిక్రయాలు జరిగినట్లు ఆరోపించింది. ల్యాండ్ పూలింగ్ కోసం రికార్డులను తారుమారు చేశారని ఆరోపించింది.తెల్ల రేషన్ కార్డులను వాడుకున్నారని చెప్పింది.

భూముల వ్యవహారంలో 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు మంత్రివర్గ ఉప సంఘం ఆరోపించింది. భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పడానికి ఆధారాలున్నాయని కూడా చెప్పింది. 

ఈ నేపథ్యంలోనే సీఐడి అధికారులు చంద్రబాబుకు, ఆయన మంత్రివర్గంలో సభ్యుడైన నారాయణకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే మరింత మందికి సిఐడి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు అర్థమవుతోంది.