విజయవాడ: కరోనా విజృంభణ, లాక్ డౌన్ విధింపు కారణంగా కుదేలయిన తెలుగు సినీ పరిశ్రమను కష్టాల నుండి బయటపడేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే  పరిశ్రమలోకి కొందరు పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి సినిమా షూటింగ్ లకు అనుమతి కోరడంతో పాటు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇలాగే ఏపి ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తమ సమస్యలను తెలియజేయడంతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించేందుకు టాలీవుడ్ పెద్దలు ఇవాళ అమరావతికి వెళుతున్నారు. 

ముఖ్యమంత్రితో సినిమా పెద్దల భేటీపై అమరావతి జేఏసీ మహిళా నేత సుంకర పద్మశ్రీ ఆసక్తికర కామెంట్ చేశారు. ''తెలుగు సినిమా కథానాయకుల్లారా... మీ అవసరాల కోసం అమరావతికి వస్తున్నారు సంతోషం. అమరావతే రాజధానిగా కొనసాగాలని రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులు 175 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక్క మాట చెప్పండి'' అని సూచించారు. 

''మీరు రీల్ లైఫ్ హీరోస్ మాత్రమే కాదు రియల్ లైఫ్ హీరోస్ అని రుజువు చేసుకోండి. అమరావతి రాజధాని ఒక్క రైతులదే కాదు మన అందరిది... అమరావతి రాజధాని మీ బాధ్యత కాదా? సినిమాలు తీసుకోవటానికి , స్టూడియోలు ఏర్పాటు చేసుకోవటానికి మాత్రం ఏపీలో భూములు కావాలి కానీ రాజధాని సమస్య మీకు పట్టదా?మీకు సినిమాలకు కలక్షన్స్ ఇస్తూ మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రజలు, అభిమానులు, రైతులు, మహిళలు పడుతున్న బాధలకు మీరు స్పందించరా? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని , రియల్  హీరోస్ అనుకునే యువతకు ఏమి సందేశమిస్తారు?'' అంటూ హీరోలను ప్రశ్నించారు. 

''5  కోట్ల ప్రజల కలల రాజధాని అమరావతి ...29000 మంది రైతులు , 34000 ఎకరాలు  భూములు  త్యాగం చేసి 175  రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల అనాలోచిత నిర్ణయం వల్ల ఏపీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు, చిన్న పిల్లల్తో సహా పోరాటం చేస్తున్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుని , అమరావతినే రాజధానిగా కొనసాగించమని జగన్ కి చెప్పండి. ఆంధ్రరాష్ట్ర అభివృద్ది, మా బిడ్డల భవిష్యత్తు,
మనకు అన్నం పెట్టే రైతన్నల కోసం సినీ పెద్దలు ఈ పని చేయాలి''  అని పద్మశ్రీ  కోరారు. 

read more  జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి సహా సీఎంను కలిసేది వీళ్లే!

కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో దాదాపు 75 రోజులుగా సినిమాలు, సీరియల్స్‌క సంబంధించిన అన్ని కార్యక్రమాలు స్తంబించిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు ఎలాంటి ఉపాది లేక ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్‌ సడలింపుల్లో భాగంగా అన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తుండటంతో సినీ ప్రముఖులు కూడా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ మేరకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలతో షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి కోసం పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో చర్చించేందుకు మంగళవారం వెళుతున్నారు. అయితే కరోనా ప్రభావం కారణంగా కేవలం ఏడుగురికి మాత్రమే రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ సీఎంఓ సూచించింది.

దీంతో చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు, దిల్‌ రాజు, సీ కళ్యాణ్ , దామోదర ప్రసాద్ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చర్చల్లో భాగంగా సినిమా షూటింగ్‌లకు సింగల్‌ విండో అనుమతులు, సినిమా హాళ్లు తెరిచే అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు.