అమరావతే రాజధాని... ఇక పరదాలు కట్టుకోవడాలుండవు.. ఎన్డీయే మీటింగ్ లో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కూటమి ఎమ్మెల్యేల కీలక భేటీ ముగిసింది. ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ చంద్రబాబు పేరును ప్రతిపాదించగా... పురందేశ్వరి బలపరిచారు. ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటు 164 మంది కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తొలుత తెలుగుదేశం సభాపక్ష (టీడీఎల్పీ) నేతగా చంద్రబాబు పేరును కింజరాపు అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా... టీడీపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపరిచారు. మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.... ఎన్‌డీయే కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరికీ అభినందనలు తెలిపారు. ఎన్‌డీయే శాసనసభా పక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు చరిత్రలో ఎన్నడూ ఇవ్వని విధంగా చరిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు. కూటమికి ఘన విజయం అందించిన ప్రజలను మర్చిపోకూడదని... అత్యున్నత ఆశయం కోసం మూడు పార్టీలు ఏకమయ్యాయని చెప్పారు. జగన్, వైసీపీ పేరెత్తకుండానే గత ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.
చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే....
‘‘నూటికి నూరు శాతం మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీడీపీ, జనసన, బీజేపీ కార్యకర్తలు ప్రవర్తించారు. కూటమి విజయానికి కారణమైన కార్యకర్తలందరికీ అభినందనలు. 175లో 164 సీట్లు గెలిచాం. అంటే 93 శాతం స్ట్రైక్ రేట్ నమోదు చేశాం. ఇదే దేశంలోనే అరుదైన ఘనత. ఓట్లు కూడా 57 శాతం మంద్రి రాష్ట్ర ప్రజలు కూటమిని ఆశీర్వదించారు. శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, నంద్యాల తదితర పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో క్లీన్ స్వీప్ చేశాం. అరకు, తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాలు కోల్పోయినా అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కడపలో 7కు ఐదుచోట్ల గెలిచాం. పవన్ కల్యాణ్ 21 సీట్లు తీసుకొని 21 గెలిచారు. బీజేపీ 10 సీట్లు తీసుకొని 8 గెలిచారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్లే రెండు సీట్లు బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. అభ్యర్థులు బలంగా నిలబడ్డ చోట అందరూ గెలిచారు. ప్రజలు కూటమిని నమ్మడం వల్లే ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపుతో ఢిల్లీలో గౌరవం పెరిగింది.''
‘‘నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కంటే ప్రజలకు ఏం చేస్తామన్నదే ఈసారి ప్రత్యేకం. రేపు (బుధవారం) జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎన్‌డీయే నాయకులు హాజరు కాబోతున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూశాం. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ముందుకు సాగాం. పవన్ కల్యాణ్ సహకారంతో పేదల జీవితాలు మారుస్తాం.''
‘‘జగన్ పాలనలో రాష్ట్రం శిథిలమైంది. దెబ్బతినని వర్గం లేదు. అందుకే ప్రతి వర్గంలో వైసీపీపై వ్యతిరేకత మొదలైంది. పొరుగు రాష్ట్రాల్లో చిన్నచిన్న పనులు చేసుకునే కూలీలు కూడా స్వగ్రామాలకు వచ్చి బాధ్యతగా ఓటేశారు. లక్షలు ఖర్చుపెట్టుకొని విదేశాల నుంచి వచ్చి ఓటేశారు. ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. అహంకారం కాల గర్భంలో కలిసిపోయింది. పదవి వచ్చిందని విర్రవీగితే ఇదే జరుగుతుంది. బూతులు మాట్లాడే నేతలకు, అరాచక శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పారు. మనం మళ్లీ అలాగే చేస్తే మనకూ అదే గతి పడుతుంది. తప్పు చేసినవారికి శిక్ష పడాల్సిందే. వదిలేస్తే అలాంటివాళ్లే మళ్లీ తయారవుతారు.’’
‘‘నాకు, నా కుటుంబానికి జరిగిన అవమానాన్ని భరించలేక సభ నుంచి బయటకు వచ్చేశా. మళ్లీ గౌరవ సభ చేశాకే తిరిగి అడుగు పెడతానని శపథం చేశా. ఆ శపథాన్ని ప్రజలు నిలబెట్టారు. అలాంటి ప్రజల రుణం తీర్చుకోవాలి.’’
‘‘రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలియదు. ఎక్కడెక్కడ ఏమేం తాకట్టు పెట్టి.. ఎంత అప్పు తెచ్చారో తెలియదు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. గతంలో 72 శాతం పనులు పూర్తిచేస్తే... మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. వ్యవసాయ రంగం కుదేలైంది. రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసి సామాన్యుల నడ్డి విరిచారు.
మనది ప్రజా ప్రభుత్వం. ప్రజా వేదికలాంటి కూల్చివేతలు ఉండవు. మూడూ రాజధానులంటూ మూడు ముక్కలాటలు ఉండవు. అమరావతే మన రాజధాని. విశాఖ ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేక సిటీగా అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం టీడీపీ, జనసేన, బీజేపీకి ముఖ్యమైన నగరం. రాజధాని అంటూ మభ్యపెట్టినా ప్రజలు నమ్మలేదు. రాలయసీమలో వ్యతిరేకత ఉంటుందనుకున్నా.. అయినా ప్రజలు ఆశీర్వదించారు. ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. అహంకారం, అరాచకం కనిపించకూడదు. అశాంతి రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదు. ’’
‘‘చెట్లు కొట్టేయడం, రోడ్లు మూసేయడం, ట్రాఫిక్ నిలిపివేయడం, పరదాలు కట్టుకోవడం లాంటివి ఇక ఉండవు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సామాన్యుడిగానే ప్రజల్లోకి వస్తా. మాకు హోదా ప్రజలకు సేవ చేసేందుకే. పేదరికం లేని సమాజం నిర్మిండమే లక్ష్యం. భారత్ దేశం ప్రపంచంలో నంబర్ వన్ గా నిలవడం, తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండటం నా కల. గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన కార్యకర్తలు, ప్రజలకు అండగా ఉంటాం. కూటమి గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.