వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కూన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్రలను వివిధ కేసుల్లో జైలుకు పంపింది.

తాజాగా మరో కీలక నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌‌కి రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందనే అభియోగంపై చిత్తూరు జిల్లాలో వున్న అమరరాజా కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఆదేశించింది.

Also Read:ఐదురోజుల ఏసీబీ కస్టడీలో ధూళిపాళ్ల.. రాజమండ్రినుంచి విజయవాడకు తరలింపు..

ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సమీక్షించి చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ‘అమర రాజా బ్యాటరీస్‌’ స్పష్టం చేసింది.

బాధ్యతాయుత సంస్థగా ఎన్నో సంవత్సరాలుగా తమ యూనిట్లలో పర్యావరణ సంరక్షణకు అనేక చర్యలు తీసుకున్నామని కంపెనీ తెలిపింది. కాలుష్య నియంత్రణ కోసం భారీ స్థాయిలో పెట్టుబడులు కూడా పెట్టామని పేర్కొంది. కాగా, అమర రాజా బ్యాటరీస్‌కు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, కరకంబాడి, నూనెగుండ్లపల్లి వద్ద తయారీ యూనిట్లు ఉన్నాయి.