కుప్పం ఆసుపత్రికి చేరుకున్న రెండు అంబులెన్స్‌లు.. కాసేపట్లో బెంగళూరుకు తారకరత్న
సినీనటుడు నందమూరి తారకరత్నను కాసేపట్లో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తరలించనున్నారు. ఇప్పటికే బెంగళూరు నుంచి రెండు అంబులెన్స్‌లు కుప్పంలోని ఆసుపత్రికి చేరుకున్నాయి.

సినీనటుడు నందమూరి తారకరత్నను కాసేపట్లో బెంగళూరుకు తరలించనున్నారు. ఇప్పటికే బెంగళూరు నుంచి రెండు అంబులెన్స్‌లు కుప్పంలోని ఆసుపత్రికి చేరుకున్నాయి. గ్రీన్ ఛానెల్ ద్వారా తారకరత్నను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ల సూచనతో మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించాలని నిర్ణయించారు కుటుంబ సభ్యులు. నారాయణ హృదయాలయలో ఆయనకు చికిత్సను అందించనున్నారు. తొలుత ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఆయనను బెంగళూరుకు తరలించాలని ప్రయత్నించారు. అయితే అందుకు అవకాశం లేకపోవడంతో గ్రీన్‌ఛానెల్ ద్వారా కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజ్ నుంచి అంబులెన్స్‌లో తారకరత్నను బెంగళూరుకు తరలించనున్నారు . ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల పోలీసులు ఇందుకోసం ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్ధితిపై బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఆయనను మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తామన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలయ్య తెలిపారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయ్యిందని.. మిగిలిన అన్ని రిపోర్టులు బాగున్నాయని బాలకృష్ణ వెల్లడించారు.
కాగా.. కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో శుక్రవారం నాడు పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో లోకేష్ తో పాటు తారకరత్న పాల్గొన్నారు. ఈ సమయంలో తారకరత్న ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తొలుత కేసీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి..అక్కడి నుండి పీఈఎస్ మెడికల్ కాలేజీకి తారకరత్నను తరలించారు. అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ వైద్యులకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. తారకరత్నకు మెరుగైన వ్యైద్య సహయం అందించాలని చంద్రబాబు కోరారు. తారకరత్నకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నంతసేపు బాలకృష్ణ అక్కడే ఉన్నారు. ఆయన వెంట రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు.