అలిపిరి - తిరుమల నడక మార్గంలో చిరుత, ఎలుగుబంటి కలకలం.. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ
అలిపిరి నడకమార్గంలో చిరుత, ఎలుగు బంటి సంచారం కలకలం రేకెత్తించింది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో ఆ దారిలో ఈ జంతువులు తిరుగుతున్నట్టు అక్కడ అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది.
నడకదారిలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) సూచించింది. నడుచుకుంటూ వచ్చే భక్తులు గుంపులు, గుంపులుగా రావాలని కోరింది. ఈ మేరకు టీటీడీ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
పట్టాలపై ఇరుక్కుపోయిన ట్రాక్టర్.. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..
అలిపిరి నుంచి తిరుమల నడగ దారిలో అక్టోబర్ 24వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య చిరుత, ఎలుగు బంటి సంచారం కనిపించినట్టు కెమెరాల్లో రికార్డు అయ్యిందని పేర్కొంది. ‘‘భక్తులకు ఓ విజ్ఞప్తి.. తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిపై శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో అక్టోబర్ 24 నుంచి 27 వరకు చిరుత, ఎలుగుబంటి కదలికలు ఉన్నట్టు కెమెరా ట్రాప్ లో రికార్డు అయ్యాయి. ’’ అని పేర్కొంది.
‘‘కాబట్టి భక్తులు నడకదారిలో అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా మాత్రమే వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.’’ అని ట్విట్టర్ లో పోస్టు చేసింది. కాగా.. ఈ నడక మార్గంలో పలు మార్లు అటవీ అధికారులు చిరుతులను బంధించారు. వాటి కోసం బోనులు ఏర్పాటు చేసి పట్టుకున్నారు.