అల్పపీడనం ప్రభావం ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో ఆకస్మిక వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చూపుతోంది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీనివల్ల ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. దీనివల్ల ఆకస్మిక వరద వచ్చే అవకాశం ఉందని వివరించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ, గోదావరి, గుంటూరు, కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని... ఆ జిల్లాల్లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అలాగే అధికంగా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది.
ఈ జిల్లాల వారు జాగ్రత్త
ప్రస్తుతం పశ్చిమం మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. దీనివల్ల రాబోయే వారం రోజులు పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. గురువారం నంద్యాల, పల్నాడు, అల్లూరి, మన్యం, పార్వతీపురం, శ్రీకాకుళం ఇలా ఎన్నో జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఇక్కడ ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఇక ఏలూరు, ముమ్మిడివరం, అమలాపురంలో భారీ వర్షపాతం నమోదయింది. కళింగపట్నం కాకినాడ విశాఖ మచిలీపట్నం పోర్టల్ లో కూడా ప్రమాద సూచికలను ఎగురవేసి మత్స్యకారులను అలెర్ట్ చేశారు.
భారీ వర్షాలు పడితే కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అలాగే లంక గ్రామాల ప్రజలు కూడా వరద ముప్పుకి గురయ్యే ప్రమాదం ఎక్కువే. అందుకే వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదులపై ఎవరో ప్రయాణించవద్దని, ఈతకు కూడా వెళ్లవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
బలమైన గాలులతో
రాగల 24 గంటల్లో సముద్ర తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వివరిస్తుంది. గురువారం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద ఇప్పటికే వరద నీరు పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా నదికి వరద పోటు ఎక్కువైతే ఆ నది చుట్టూ ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
ఇక నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పడుతోంది. పది అడుగుల మేర గేటు ఎత్తడంతో వరద నీరు తగ్గింది. కోస్తాంధ్రలో ఉన్న ప్రజలు భారీ వర్షాలకు సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది.
