తెనాలి బరిలో నాదెండ్ల మనోహర్ .. ఆలపాటి రాజాను ఇంటికి పిలిపించిన చంద్రబాబు
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి సీటును పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అడుగుతారని భావించారు. అనుకున్నట్లుగానే తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల అభ్యర్ధిత్వం ఖరారైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజేంద్రప్రసాద్ భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన తొలి జాబితాను శనివారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో స్థానం దక్కని నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని కీలక స్థానాల్లో ఒకటైన తెనాలి పొత్తులో భాగంగా జనసేన కోరడంతో ఈ సెగ్మెంట్‌ను తెలుగుదేశం పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేనతో టీడీపీ పొత్తు ఖరారైనప్పుడే తెనాలి సీటు విషయంలో సర్వత్రా చర్చ జరిగింది.
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోసం తెనాలి సీటును పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అడుగుతారని భావించారు. అనుకున్నట్లుగానే తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల అభ్యర్ధిత్వం ఖరారైంది. మరి ఆలపాటి పరిస్ధితి ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజేంద్రప్రసాద్ భేటీ అయ్యారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసానికి ఆలపాటిని పిలిపించిన చంద్రబాబు బుజ్జగించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.