ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మండలం యాదవాడలో యురేనియం రిజర్వ్స్ ఉన్నాయేమో తెలుసుకోవడానికి సర్వే జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అక్కడకు చేరుకున్నారు. శనివారం రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అఖిలప్రియ అక్కడకు చేరుకున్నారు. 

వెంటనే అనుమతులు ఉన్నాయా అంటూ సర్వే నిర్వహించిన సూపెర్వైజర్ ను ప్రశ్నించారు. మొదట అనుమతులున్నాయంటూ బుకాయించిన సదరు సూపెర్వైజర్ గట్టిగా ప్రశ్నించడంతో ఎమ్మార్వో ని అడిగి చెబుతానండి అంటూ జారుకున్నాడు. 

తరువాత ఎమ్మార్వో ని ఇదే విషయమై ప్రశ్నించగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపాడు. మరి జరుగుతున్న పనులను ఇన్ని రోజులనుండి ఎందుకు ఆపలేదు అని ప్రశ్నించగా రివ్యూ సమావేశాల్లో బిజీగా ఉన్నానంటూ సమాధానమిచ్చారు. 

ఇలా రివ్యూ సమావేశాలకు ప్రజల సమస్యలకన్నా ప్రియారిటీ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇలానే మీటింగులకు ప్రియారిటి  ఇచ్చుకుంటూ వెళితే ప్రజలు తీరుబడి ప్రశ్నిస్తారని హెచ్చరించారు.