Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డపై వెనక్కి తగ్గని జగన్ సర్కార్: ఏజీ సంచలన వ్యాఖ్యలు

హైకర్టు చెప్పిన తీర్పు ప్రకారమే ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం చెల్లదని ఏపీ ఏజీ సుబ్రహ్మణ్యం శ్రీరాం అన్నారు. ఎస్ఈసీగా తనను తాను నియమించుకునే అధికారం రమేష్ కుమార్ కు లేదని అన్నారు.

AG Subamaniam Sreeram says Nimmagadda Ramesh Kumar appointment was illegal
Author
Amaravathi, First Published May 31, 2020, 6:50 AM IST

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ మాత్రం సుముఖంగా లేదు. రమేష్ కుమార్ ను వెంటనే ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, అందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా లేదనేది రాష్ట్ర ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుబ్రహ్మణ్యం శ్రీరాం వ్యాఖ్యలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 

ఎస్ఈసీగా తనను తాను తిరిగి నియమించుకునే అధికారం రమేష్ కుమార్ కు లేదని ఏజీ అన్నారు. అలా స్వయంగా ప్రకటించుకోవడం చట్ట విరుద్ధమని అన్నారు. ఆయనను తిరిగి నియమించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందే తప్ప ఆయనే స్వయంగా వెళ్లి ఆ పోస్టులో కూర్చునే వెసులుబాటును కల్పించలేదని ఆయన అన్నారు. 

హైకోర్టు తీర్పు ప్రకారం చూస్తే ఎస్ఈసీగా రమేష్ కుమార్ నియామకమే చట్ట విరుద్ధమని ాయన అన్నారు. అటువంటి స్థితిలో ఆయనను మళ్లీ అదే పోస్టులో నియమించి మరో తప్పు చేయాలా అని ఏజీ ప్రశ్నించారు. ఆ అంశంపై స్పష్టత కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఎస్ఈసీ పోస్టులో తనను తాను నియమించుకుంటూ ప్రభుత్వ అధికారులకు రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలు చెల్లుబాటు కావని అన్నారు. 

పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తో కలిసి ఆయన శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల అమలుకు ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తున్నందున తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రభుత్వం తరఫున పిటిషన్ వేశామని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని ఆయన చెప్పారు. 

రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా నియమించాలని 2015 డిసెంబర్ 12వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ కు సిఫార్సు చేశారని చెబుతూ సెక్షన్ 200 చెల్లదనీ ముఖ్యమంత్రి, మంత్రి మండలి సిఫార్సు మేరకు ఎస్ఈసీని గవర్నర్ నియమించకూడదని హైకోర్టు చెప్పిన తీర్పు రమేష్ కుమార్ కు వర్తిస్తుందని, అందువల్ల ఆనయ నియామకం చెల్లదని శ్రీరాం అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios