హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరో ప్రముఖ సినీనటి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ఆమె ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా..? ఇంకెవరు నటి హేమ. 

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేమ ఇకపై పొలిటికల్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. 2014లోనే రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ అది అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని హేమ నిర్ణయించుకున్నారు. తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. త్వరలో తాను వైసీపీలో చేరతానేమోనంటూ క్లారిటీ ఇచ్చేశారు.  

బిగ్ బాస్ 3 నుంచి ఎలిమినేట్ అవ్వడం, బిగ్ బాస్ హౌస్ లో నటి హేమపై జరిగిన వ్యవహారంపై ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. 

ఇకపోతే హేమ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు పలికారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లో కలిసి తన మద్దతు ప్రకటించారు. కానీ వైసీపీలో మాత్రం చేరలేదు. 

అయితే త్వరలోనే ఆమె వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే తన సొంత జిల్లా అయిన తూర్పుగోదావరిలో ఇల్లు సైతం కొనుగోలు చేసింది. ఇకపై తన సొంత జిల్లా రాజకీయాల్లో కీ రోల్ పోషించాలని హేమ భావిస్తోంది. 

ఇకపోతే నటి హేమ 2014 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్రపార్టీలో చేరారు. జై సమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు హేమ.