అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశంపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి. 

వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఇప్పటి వరకు ఆరుగురిని పొట్టన బెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంతలా దాడులు జరుగుతున్నా సీఎం జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం చక్కటి పరిపాలన అందిచాలని కానీ దాడులకు పురిగొల్పుతోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనాలను కూల్చివేయడం అభివృద్ధి కాదన్నారు. 

కూల్చేవాడు నాయకుడు కాదని కట్టే వాడే నాయకుడు అంటూ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉన్నా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడంతోపాటు రాజధానిని నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడుది అన్నారు. 

చంద్రబాబు నాయుడుకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉందని అంతటి ఫాలోయింగ్ ఎవరికైనా ఉందా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అంతా ఆవేదనతో ఉన్నారని చెప్పుకొచ్చారు. 

దేశంలో ప్రధాని నరేంద్రమోదీకి పోటీ వచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చారు. జ్ఞానంలో, రాజకీయ అనుభవంలో మోదీని మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అందువల్లే అంతా కలిసి ఏపీలో తెలుగుదేశం పార్టీని ఓడించారని ఆరోపించారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. ట్విట్టర్ లో పోస్టులు చేయాలంటే రెండు ఏళ్లు జైల్లో ఉండాలా అంటూ నిలదీశారు.  

లోకేష్ ను ట్విట్టర్ పిట్ట అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యవాణి. మాట్లాడే వాడే నాయకుడు కాదని బుద్ధిబలం ఉన్నవాడే నాయకుడన్నారు. పరిపాలించడానికి కావాల్సింది బుద్ధిబలమేనన్నారు. ఆ బుద్ధిబలం నారా లోకేష్ దగ్గర చాలా ఉందన్నారు.