విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు సినీనటుడు ఆర్.నారాయణమూర్తి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని జగన్ ప్రకటించడం అభినందనీయమని కొనియాడారు.   

పార్టీ ఫిరాయింపులను ఏ పార్టీ ప్రోత్సహించొద్దని హితవు పలికారు. ఫిరాయింపులు ప్రోత్సహించడం వల్లే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఆర్ నారాయణ మూర్తి ఆరోపించారు. విశాఖపట్నంలో మార్కెట్ లో ప్రజాస్వామ్యం సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి రాజకీయ ఇతివృత్తంగా తమ చిత్రం ఉంటుందన్నారు. 

పార్టీ ఫిరాయింపులు సరికాదంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదేపదే చెప్తుండేవారని కానీ ఆయన మాటలను ఎవరూ గౌరవించడం లేదని పెడచెవిన పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పార్టీ ఫిరాయింపుల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్పారు నారాయమూర్తి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహించనని జగన్ చెప్పడం అభినందనీయమన్నారు.