జగన్ నాయకత్వంలోని వైసిపి నుంచి సస్పెన్షన్ కు గురైన తెలుగు సినీ నటుడు పృథ్వీరాజ్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరనున్నారు. నాగబాబుతో భేటీ తర్వాత పృథ్వీరాజ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్: సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరనున్నారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ స్వయంగా ప్రకటించారు. జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబును ఆయన కలిశారు. తాను జనసేనలో చేరుతున్నట్లు నాగబాబుతో భేటీ తర్వాత ఆయన ప్రకటించారు. పృథ్వీరాజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
తాజాగా ఆయన నాగబాబును కలిసి తన అభిమతాన్ని వెల్లడించారు. పృథ్వీరాజ్ త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉంది. శాసనసభ ఎన్నికలకు ముందు నుంచి పృథ్వీరాజ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తూ వైసిపిలో పనిచేస్తూ వస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయన ప్రచారం కూడా చేశారు. దానికి ప్రతిఫలంగా జగన్ ఆయనను ఎస్వీబీసి చైర్మన్ గా నియమించారు. అయితే, ఓ మహిళతో రాసలీలలు నడిపించారనే ఆరోపణతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. దాంతో ఆయనను వైసిపి నుంచి సస్పెండ్ చేశారు. అదే సమయంలో ఆయన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది.
