హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సినీనటుడు పృథ్విరాజ్ నిప్పులు చెరిగారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష పేరుతో రూ.10 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గతంలో ప్రత్యేక హోదా సంజీవని కాదన్న చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. 

చంద్రబాబు నాటకాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలిపారు. తనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతతో వైసీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తానన్నారు. 

చంద్రబాబు దీక్షలకు కేవలం టీడీపీ నాయకులు మాత్రమే వస్తారని తమ దీక్షకు జెండా మోసే కార్యకర్తలు వస్తారన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్, వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని ఆరోపించారు.

 చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై నాటకాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించబోతున్నట్లు స్పష్టం చేశారు. తమ కళాకారుల బృందం ప్రతి గ్రామానికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ పథకాలు ఎందుకు రాలేదో ప్రశ్నిస్తుందన్నారు. 

మందులోడా.. ఓ మాయలోడా అంటూ ఊరువాడ ప్రచారం చేస్తామన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యంగా పనిచేస్తామని పృథ్వీ స్పష్టం చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి తాము సిద్ధంగా ఉన్నామని సినీనటుడు కృష్ణుడు తెలిపారు. పృథ్విరాజ్ కి రాష్ట్రకార్యదర్శి బాధ్యతలు అప్పగించడం శుభపరిణామమన్నారు.