అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు హాస్యనటుడు బ్రహ్మానందం. జగన్ అరేబియన్ హార్స్ అంటూ పొగడ్తలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి రాజ్యాధికారం చేపట్టిన నాయకుడు జగన్ అంటూ పొగిడేశారు.

గుర్రం జాఘువా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బ్రహ్మానందం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయమని, ప్రయత్నం విరమిస్తే అది మరణం అని తెలిసిన ఏకైక నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 18నెలలు నిరాటంకంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలలా పాదయాత్ర చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. 

జగన్ పాదయాత్రలో ఎన్నో అవమానాలు జరిగాయని, ఎన్నో ఎదురుదెబ్బలు, అవహేళన తగిలాయని వాటన్నింటిని ఆయన తట్టుకుని నిలబడ్డారంటూ చెప్పుకొచ్చారు. ఎవరు ఏమనుకున్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయలేదన్నారు. 

రెండు కళ్లకు గంతలు కట్టిన అశ్వంలా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారని ప్రశంసించారు. అరేబియన్ హార్స్ లా జగన్ రాష్ట్రవ్యాప్తంగా తిరిగి రాజ్యాధికారం చేపట్టారని చెప్పుకొచ్చారు. 

మన ఆరోగ్యం కోసం వాకింగ్ చేయాలనుకుంటే చేయలేని పరిస్థితి అని అయినప్పటికీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి 18 నెలలపాటు అహర్నిశలు శ్రమించి పాదయాత్ర చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు బ్రహ్మానందం.