కాకినాడ: సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లాలోని ఓ టెంపుల్ లో హల్ చల్ చేశారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చౌడేశ్వరి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో కుమారుడు మోక్షజ్ఞతో  కలిసి ప్రత్యేక పూజలు చేశారు. 

ఆలయంలో చండీ హోమం, సుదర్శన హోమం, స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. అయితే మోక్షజ్ఞత్వరలోనే టాలీవుడ్ కు పరిచయం అవుతున్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే బాలకృష్ణ ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇదే మెుదటి సారి కాదు. గతంలో చాలా సార్లు బాలకృష్ణ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు సినిమాలు విజయవంతమైనప్పుడు, ప్రారంభోత్సవాలకు కూడా బాలయ్య ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ.  

బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించిన నేపథ్యంలో ఆలయం దగ్గర పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. అత్యంత గోప్యంగా ఈపూజాది కార్యక్రమాలను నిర్వహించారు బాలయ్య.