ప్రధాని నరేంద్రమోదీ.. తన వేలితో తన కంటినే పొడుచుకుంటున్నారని టీడీపీ మహిళా నేత, సినీ నటి దివ్య వాణి అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో ధర్మపోరాట దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యవాణి.. ప్రధాని నరేంద్రమోదీపై మండిపడ్డారు.

ధర్మమంటే తెలియని.. అవినీతికి ప్రతీకగా ఉన్న నరేంద్రమోదీ బుర్ర తిరిగే విధంగా ఏపీ ప్రజలు ఈ రోజు ఆవేదన, ఆవేశంతో ధర్మపోరాట దీక్ష చేస్తున్నామన్నారు. ఆదివారం గుంటూరులో మోదీ సభకు వచ్చిన జనమంతా.. వైసీపీ ఇచ్చిన డబ్బు, బిర్యానీ కోసం వచ్చిన వాళ్లేనని చెప్పారు. 

ఆంధ్ర ప్రజల హక్కుల కోసమే తాము పోరాడుతున్నామని.. అదేమీ మోదీ తాత సొమ్మేమీ కాదు కదా అని ఆమె ప్రశ్నించారు. న్యాయానికి ప్రతీకగా ప్రజలంతా తమ కుటుంబాలను కాదని.. చంద్రబాబు చేస్తున్న దీక్షకు వచ్చారని చెప్పారు. ఆనాడు ఎన్టీఆర్ దెబ్బకు కొమ్ములు తిరిగిన ఇందిరాగాంధీ వణికిపోయారని.. ఇప్పటికైనా ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆవేనద అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు.

ఆనాడు అధికారం కోసం చంద్రబాబు కాళ్ల దగ్గరకు వచ్చి అడుక్కోలేదా అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల ముందు తిరుపతికి వచ్చి మాట్లాడిన మోదీ ఇప్పుడు హామీలను నెరవేర్చడంలో విస్మరించారన్నారు. పరిపాలన చేయడం చేతకాకపోతే.. చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలని హితవు పలికారు.