మదనపల్లి అక్కాచెల్లెల్ల హత్య కేసులో వారి తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా... వారిలో పద్మజ మానసిక పరిస్థితి సరిగా లేదనిపిస్తోంది. పోలీసుల విచారణలోనూ సరిగా సహకరించని పద్మజ.. జైల్లో తోటి ఖైదీలకు సైతం చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

‘‘కలియుగ యుద్ధం జరుగుతోంది. నేనే శివుడిని. నన్నే లోపలేస్తారా!’’ అంటూ కన్నబిడ్డల హత్య కేసులో జైలుకు వెళ్లిన పద్మజ మరోమారు అరుపులతో జైలును హోరెత్తించింది. దీంతో ఆందోళనకు గురైన సహచర ఖైదీలు ఆమెను ప్రత్యేక గదికి తరలించాలని మొర పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లె స్పెషల్‌ సబ్‌ జైలులో ఈ ఘటన జరిగింది. 

పురుషోత్తమ నాయుడు, పద్మజ దంపతులను గతనెల 24న తమ కన్నబిడ్డలైన అలేఖ్య, సాయిదివ్యను హత్య చేసిన కేసులో జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రెండు రోజులకే... అంటే జనవరి 26 రాత్రి పద్మజ అరుపులు, కేకలతో ఖైదీలతో పాటు జైలు సిబ్బందీ హడలెత్తిపోయారు. 

మానసిక వైద్యనిపుణులు వారిని చికిత్స నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించాలని రిఫర్‌ చేశారు. ఈ సూచన నేపథ్యంలో పద్మజను ప్రత్యేక గదిలో ఉంచిన  జైలు అధికారులు ఓ మహిళా కానిస్టేబుల్‌నూ కాపలాగా పెట్టారు. తిరిగి ఆమె శాంతించడంతో మహిళా బ్యారక్‌కు పంపారు.