చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ముగిసిన వాదనలు: తీర్పు సోమవారానికి వాయిదా

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై  ఏసీబీ కోర్టులో ఇరు వర్గాల వాదనలు ఇవాళ ముగిశాయి.  సోమవారంనాడు తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది. 

ACB Court To Verdict on Chandrababunaidu Bail and CID Custody petitions lns

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై  ఇరు వర్గాల వాదనలు శుక్రవారంనాడు ముగిశాయి. ఈ నెల 9వ తేదీకి తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును గత నెల 9వ తేదీన ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.  నిన్ననే చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ ను ఏసీబీ కోర్టు రెండు వారాలకు పొడిగించిన విషయం తెలిసిందే.

 స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరించిన  వెంకటేశ్వర్లు  టీడీపీకి ఆడిటర్ గా వ్యవహరించారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.14రోజుల జ్యుడీషీయల్ రిమాండ్ ముగిసిన తర్వాత పోలీసు కష్టడికి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దర్యాప్తు సంస్థ విచారణలో వచ్చిన సమాచారాన్ని బట్టి విచారణ కోరవచ్చని సుధాకర్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. 

ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ నుంచి బ్యాంక్ స్టేట్‌మెంట్  ను ఎవరూ డౌన్ లోడ్ చేయలేరని ఏఏజీ సుధాకర్ రెడ్డి చెప్పారు.ఐటీ రిటర్న్స్ మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. బ్యాంకర్లు సహకరిస్తే స్టేట్‌మెంట్ వస్తుందని  సుధాకర్ రెడ్డి  తెలిపారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే పోలీసులు చంద్రబాబును విచారిస్తారని ఏఏజీ సుధాకర్ రెడ్డి  చెప్పారు. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని వాదించారు.

చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారని కోర్టుకు తెలిపారు. అంతేకాదు టీడీపీ ఖాతాలో రూ.27 కోట్లు నేరుగా  ఖాతాలో జమ అయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయం ముందు అందరూ సమానమే అంటూ ఆర్టికల్ 14న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రస్తావించారు. ముఖ్యమంత్రైనా...సామాన్యుడికైనా న్యాయమొక్కటేనన్నారు. ఇది ఆర్డనరీ కేసు కాదు....తీవ్ర ఆర్ధిక నేరం కలిగిన కేసంటూ  పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ వాదనలు చంద్రబాబు తరపు న్యాయవాది  ప్రమోద్ కుమార్ దూబే తోసిపుచ్చారు.


కేసు డైరీ లేకుండా జ్యుడీషీయల్ రిమాండ్ పొడిగించడకూడదని దూబే చెప్పారు.మొదటి రిమాండ్ సమయంలో సీఐడీ కస్టడీకి రెండు రోజులు ఇచ్చిన విషయాన్ని దూబే గుర్తు చేశారు. రూల్ 25కి క్రిమినల్ రూల్ ఆఫ్ ప్రాక్టీస్ కు విరుద్దమని దూబే హైకోర్టులో వాదించారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు కు సంబంధం లేదని దూబే పేర్కొన్నారు.రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారని దూబే అభిప్రాయపడ్డారు. డిజైన్ టెక్ సంస్థ తో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని  ఆయన వాదించారు. 

చంద్రబాబు సిఎం హోదాలో స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కు నిధులు మాత్రమే మంజూరు చేశారని దూబే వివరించారు. ఆ తరువాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేశారని దూబే గుర్తు చేశారు. రెండు లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారన్నారు.

అంతా ఓపెన్ గా జరిగితే ఇందులో స్కాం ఎక్కడుంది, చంద్రబాబు పాత్ర ఏముందని దూబే ప్రశ్నించారు.ఇది పూర్తి గా రాజకీయ కక్ష తో పెట్టిన కేసుగా దూబే వాదనలు విన్పించారు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదన్నారు. కస్టడీ లో చంద్రబాబు విచారణ అధికారులకు సహకరించారని ఆయన ప్రస్తావించారు. ఇక కస్టడీ కూడా అవసరం లేదని దూబే కోర్టును కోరారు.విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారని  బాబు తరపు న్యాయవాది చెప్పారు.ఈ అంశాలను పరిశీలన చేసి  బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత  తీర్పును సోమవారం నాడు ఇవ్వనున్నట్టుగా  ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios