చంద్రబాబు అరెస్టుపై హౌస్ మోషన్ పిటిషన్.. తిరస్కరించిన ఏసీబీ కోర్టు జడ్జి..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయనను వెంటనే కోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు నాయుడు తరఫున ఆయన లాయర్లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసి చాలా సమయమైందని.. ఆయన వయసు, ఆరోగ్య రీత్యా 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని లాయర్లు తమ పిటిషన్‍లో పేర్కొన్నారు. శనివారం నాడు రాత్రి 11 గంటల సమయంలో గురునానక్ కాలనీలోని న్యాయమూర్తి నివాసం వద్దకు వెళ్లిన న్యాయవాదులు ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో సిట్ అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్నారని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి.. చంద్రబాబును త్వరగా కోర్టులో హాజరు పరిచేలా ఆదేశాలివ్వాలని టీడీపీ లీగల్ సెల్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు జడ్జి తిరస్కరించారు. సీఐడీ రిమాండ్ రిపోర్టు దాఖలు చేసిన తర్వాత కోర్టులో పిటిషన్ వేయాలని జడ్జి స్పష్టం చేశారు.
మరోవైపు జడ్జి నివాసానికి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, టీడీపీ నాయకులు చేరుకోవడంపై స్థానిక పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో న్యాయవాదులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. మరోవైపు చంద్రబాబుకు బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
డిలే ఆఫ్ ప్రొడ్యూస్ లో భాగంగా చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలంటూ.. హౌస్ మోహషన్ పిటిషన్ వేసేందుకు లాయర్లు సిద్ధమయ్యారు. చంద్రబాబును ఉదయం 6 గంటల ప్రాంతంలో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు సీబీఐ అధికారులు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 6 గంటల పాటు సాగిన విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
మరోవైపు..టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేయాలని టీడీపీ పిలుపు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి నిరాహార దీక్షలు చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు.
పవన్ కళ్యాణ్ నిరసన
చంద్రబాబు నాయుడుని కలిసేందుకు విజయవాడ బయల్దేరిన జనసేనాని పవన్ కళ్యాణ్‌ను అనుమంచిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహించి.. రోడ్డుపై బైఠాయించి, పడుకొని తనదైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కాలి నడకన మంగళగిరి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పలు నాటకీయ పరిణామాల అనంతరం పవన్ ను విజయవాడ వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే.. కేవలం మూడు కార్లనే అనుమతించారు.