Asianet News TeluguAsianet News Telugu

ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్ డిస్మిస్..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా ఆయన ఊరట దక్కలేదు.

acb court dismisses chandrababu naidu bail Plea in skill development scam ksm
Author
First Published Oct 9, 2023, 3:37 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా ఆయన ఊరట దక్కలేదు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. అదే సమయంలో చంద్రబాబును కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను సైతం ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

ఈ పిటిషన్లకు సంబంధించి చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇరువైపుల న్యాయవాదులు ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు సాగాయి. అయితే వాదనల అనంతరం తీర్పును నేటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్‌లను డిస్మిస్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక, ఈ కేసులో చంద్రబాబు జ్యూడిషల్ రిమాండ్‌ను ఈ నెల 19 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు మూడు కేసుల్లో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ అరెస్టు చేసిన తర్వాత.. చంద్రబాబు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు హింస కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం వేర్వేరుగా పిటిషన్‌లను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌లపై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా, తీర్పులను న్యాయమూర్తి ఈరోజుకు రిజర్వ్ చేశారు. అయితే తాజాగా తీర్పు వెలువరిస్తూ.. ఆ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios