సీఐడీ అధికారుల కాల్ డేటా: చంద్రబాబు పిటిషన్ పై విచారణ ఈ నెల 18కి వాయిదా
అరెస్ట్ సమయంలో విధి నిర్వహణలో ఉన్న సీఐడీ అధికారుల కాల్ డేటా విషయమై చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ నెల 18వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
అమరావతి: చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఏపీ సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.ఇప్పటికే ఈ కేసులో ఇరువర్గాల న్యాయవాదుల వాదనలను ఏసీబీ కోర్టు విన్నది. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు జడ్జి ఇవాళ తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్ సమయంలో పాల్గొన్న సీఐడీ అధికారులకు సంబంధించిన కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సెప్టెంబర్ మాసంలోనే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలను సమర్ధించుకొంటూ వాదనలు వినిపించారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్ కు ఏసీబీ కోర్టు ఈ నెల 12న ఆమోదం తెలిపింది. చంద్రబాబును ప్రత్యక్షంగా ఈ నెల 16న కోర్టులో హాజరుపర్చాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.