అమరావతి: నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుకు మరో షాక్ తగిలింది. డ్రోన్ల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో ఆయన సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. తనకు మద్దతు తెలియజేయాలని ఆయన ఐపిఎస్ అధికారుల సంఘానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు 

ఏబీ వెంకటేశ్వర రావు రాసిన లేఖపై ఐఎఎస్ అధికాగుల సంఘం సుదీర్ఘంగా చర్చించింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం సరైందేనని సంఘం అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారని, విచారణను ఎదుర్కోక తప్పదని అభిప్రాయపడింది. ఈ విషయంలో తాము ఏ విధమైన జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. 

తాము ఏబీ వెంకటేశ్వర రావుకు మద్దతు తెలిపినట్లు కొన్ని టీవీ చానెళ్లలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తాము ఏబీ వెంకటేశ్వర రావుకు ఏ విధమైన మద్దతు కూడా తెలియజేయలేదని స్ప,ష్టం చేసింది. ఐపిఎస్ అధికారులపై ఏ విధమైన ఆరోపణలు చేయకూడదని సంఘం ఏబీ వెంకటేశ్వర రావుకు సూచిచింది.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వర రావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణపై సస్పెన్షన్ కు గురయ్యారు. దానిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన సస్పెన్షన్ మీద హైకోర్టు స్టే ఇచ్చింది. 

అయితే, ఏబీ వెంకటేశ్వర రావు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) స్పష్టంచేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను కొట్టేసింది. దీంతో హైకోర్టు ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ మీద హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.