విశాఖపట్నంలో విషాదం... అపార్ట్‌మెంట్ పైనుండి పడి బాలుడు మృతి
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే వుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు మూడో అంతస్తునుండి పడి ప్రాణాలు కోల్పోయాడు.
విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక నర్సింగ్ రావు పేటలోని ఓ అపార్ట్ మెంట్ పై నుండి ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఓ అపార్ట్ మెంట్ లో సూర్యనారాయణ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా
ఇంట్లోనే వుంటున్న అతడి కుమారుడు సూర్య ప్రతాప్ (13సంవత్సరాలు) తోటి స్నేహితులతో అపార్ట్ మెంట్ పై అడుకుంటుండగా ప్రమాదవశాత్తు మూడవ అంతస్తు నుండి జారి కిందపడిపోయాడు. దీంతో రెండు కాళ్లకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అతడి ఆరోగ్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించగా బాలుడు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గాజువాక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు.
బాలుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.ఈ ఘటనతో స్థానిక నరసింగరావు పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.