ఓ భర్త ప్రతీ రోజు తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భార్య విసుగు చెందింది. 18 నెలల కూతురుకు కూల్ డ్రింక్ లో విషమిచ్చి, తరువాత ఆమె కూడా దానిని తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో విషాదం నింపింది.
అతడు తాగుడికి బానిసయ్యాడు. కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. తీరు మార్చుకోవాలని అతడికి భార్య పలుమార్లు చెప్పి చూసింది. ఎన్ని సార్లు చెప్పినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆమె తీవ్రంగా కలత చెందింది. దీంతో కూతురుకు విషమిచ్చి, ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని హరినగరం చెంచుగూడెంలో పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయనకు ఎనిమిదేళ్ల కిందట నాగేంద్రమ్మతో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో ఒకరి పేరు హన్సిక కాగా, మరోకరి పేరు వెన్సిక. అయితే భర్త కొంత కాలం నుంచి తాగుడికి బానిస అయ్యాడు.
ప్రతీ రోజూ మద్యం సేవిస్తూ ఇంటిని పట్టించుకునేవాడు కాదు. దీంతో నాగేంద్రమ్మకు విసుగు వచ్చింది. తాగుడు మానేయాలని భర్తకు ఎన్నో సార్లు చెప్పింది. కానీ అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. దీంతో ఆమె తీవ్రంగా ఆవేదన చెందింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ముందుగా 18 నెలల వయస్సు ఉన్న కూతురు హన్సిక కు విష గుళికలు కలిపిన కూల్ డ్రింక్ తాపింది. అనంతరం నాగేంద్రమ్మ కూడా దానిని తాగింది. దీంతో వారు అపస్మారస్థితిలోకి చేరుకున్నారు.
మిగిలిన కూల్ డ్రింక్ ను 5 సంవత్సరాల వయస్సు ఉన్న పవన్ కల్యాణ్ సోదరుడి కుమారుడు నందు తాగేశాడు. అయితే కొంత సమయం తరువాత వీరందరినీ బంధవులు గమనించారు. వెంటనే వారిని ఆళ్లగడ్డ హాస్పిటల్ కు తీసుకెళ్లాని భావించారు. ఓ వాహనంలో వారిని ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్తుండగా పరిస్థితి విషమించి తల్లీకూతుర్లు చనిపోయారు. నందు ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నాడు. ఆ పిల్లాడు నంద్యాల హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై నాగేంద్రమ్మ తల్లి ప్రభావతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లుడు తాగి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.
