విజయవాడలోని టీవీఎస్ షో రూమ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో సుమారు 300 బైక్ లు దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటల చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.

విజయవాడలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కేపీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ టీవీఎస్ బైక్ షో రూమ్ లో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో దాదాపు 300 బైక్ లు దగ్ధం అయినట్టు సమాచారం. అలాగే షోరూమ్ కూడా తీవ్రంగా దెబ్బతింది.

విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ బైక్ లకు మెయిన్ బ్రాంచ్ అయిన ఈ షోరూం చెన్నై-కోల్ కతా నేషనల్ హైవే సమీపంలో ఉంది. ఈ షోరూంకు ఆనుకొని ఉన్న గోదాముల్లో పెద్ద సంఖ్యలోనే బైకులు నిల్వ ఉంచుతారు. ఈ షోరూంలోనే సర్వీస్ సెంటర్ కూడా ఉంది. గోదాం, సర్వీస్ సెంటర్, షో రూమ్ ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో బైక్ లు వస్తుంటాయి.

కాగా.. ఈ షోరూమ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో నేటి తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయని తెలుస్తోంది. అందులో పెట్రోల్ బైక్ లతో పాటు ఎలక్ట్రిక్ బైక్ లు నిల్వ ఉంచడం వల్ల ఈ మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే మూడు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నారు. మంటలను చల్లార్చేందుకు ప్రయత్నం చేశాయి. కానీ మూడు అంతస్తులతో ఉన్న ఆ బిల్డింగ్ ను ప్రీఫ్యాబ్రిక్‌ పద్దతిలో నిర్మించడం వల్ల మంటలు స్పీడ్ గా వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచార అందటంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదం పై విచారణ చేపడుతున్నారు.