9,514 కోట్లతో అభివృద్ది... గ్రామీణ పేదలకు జగన్ ప్రభుత్వం భరోసా
రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పలు అభివృద్ది పనులకు ఉపాధిహాామీని అనుసంధానిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి: కరోనా కష్టకాలంలో గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. "ఉపాధి హామీ" ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధితో పాటు వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు ఊతమిచ్చేలా కార్యాచరణను రూపొందించింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూనే... ఉపాధి కూలీలకు అందులో భాగస్వామ్యం చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
ఈ క్రమంలోనే రూ.9,514తో కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభించి... వీటికి "ఉపాధి హామీ"ని అనుసంధానం చేయనున్నట్లు వైసిపి ప్రభుత్వం వెల్లడించింది. ఇలా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఉపాధి హామీతో ఊతం ఇచ్చేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు.
గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1.85 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పండ్ల తోటల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే సన్న, చిన్నకారు రైతులకు రూ.300 కోట్లు కేటాయించారు. సెరీకల్చర్ శాఖ ఆధ్వర్యంలో రూ.76 కోట్లతో మల్బరీ మొక్కల పెంపకం చేపట్టనున్నారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.117 కోట్ల ఖర్చుతో వెయ్యి నర్సరీలలో మొక్కల పెంపకం చేపట్టనున్నారు. గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాల నిర్మాణానికి రూ.5,079 కోట్లు కేటాయించారు. రూ.593 కోట్ల అంచనాలతో ఆర్ డబ్ల్యు ఎస్ శాఖ ద్వారా గ్రామాల్లో 3,932 చోట్ల సిసి డ్రైన్ ల నిర్మాణం చేపట్టనున్నారు.
రూ.1,640 కోట్లతో పిఆర్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించారు. గిరిజన ప్రాంతాల్లో కొత్తగా బిటి, మెటల్ రోడ్ల నిర్మాణానికి గాను రూ.46.70 కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపునకు రూ.100 కోట్లు, నాడు-నేడు ద్వారా 11,623 సర్కారు బడులకు రూ.995 కోట్లతో ప్రహరీల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ అభివృద్ది పనులన్నింటిని ఉపాధి హామీకి అనుసంధానించనున్నారు.