ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. అద్దంకిలో ఊయల కోసం వేసిన చీర మెడకు చుట్టుకుని ఓ బాలిక మరణించింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని రాజీవ్ కాలనీకి చెందిన రాజు అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో లక్ష్మీప్రసన్న అనే బాలికను చిన్నతనంలో దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు.

అయితే గతేడాది అనారోగ్యం కారణంగా రాజు మరణించడంతో అప్పటి నుంచి లక్ష్మీప్రసన్న సంరక్షణను రాజు సోదరి బుజ్జమ్మ పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో వేసవి కావడంతో పిల్లలంతా సమీపంలోని ఓ చెట్టు కిందకు చేరి ఆడుకున్నారు.

వారంతా ఇళ్లకు వెళ్లిపోయినప్పటికీ లక్ష్మీప్రసన్న మాత్రం చెట్టుకు చీరతోకట్టిన ఊయల ఎక్కి కూర్చోంది. ఈ క్రమంలో ఊయల ఊగుతుండగా.. అది మెలికలు తిరుగుతూ చీర మెడకు చుట్టుకుంది.

ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఆమె కేకలు ఎవరికి వినిపించలేదు. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి లక్ష్మీప్రసన్నను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.