ఏపీ రాష్ట్రంలో  ప్రవేశపెట్టిన ప్రకృతి సేద్యం  పట్ల ప్రపంచ దేశాలు  ఆసక్తిని చూపాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు


అమరావతి: ఏపీ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రకృతి సేద్యం పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తిని చూపాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రకృతి సేద్యం వల్ల ఏ రకమైన ప్రయోజనం ఉంటుందో అనే విషయాన్నిప్రపంచానికి వివరించినట్టు చెప్పారు.

ఐక్యరాజ్యసమితిలో ప్రకృతి సేద్యంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగించారు. ఈ విషయమై శుక్రవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

విపరీతంగా రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి నిస్సారంగా మారే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా మనుషుల శరీరాల్లో కూడ వ్యాధులకు కారణమౌతాయన్నారు.

ప్రకృతి సేద్యంతో పెద్ద ఎత్తున ప్రయోగం చేయబోతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యంలో లక్షలాది మంది రైతులను ఎలా ఒప్పించామని ప్రపంచదేశాలు ఆశ్చర్యపోయారని ఆయన గుర్తు చేశారు.

2024 నాటికి ఏపీలో 60 లక్షల మంది రైతులను ప్రకృతి సేద్యంలో భాగస్వామ్యులను చేసేలా ప్లాన్ చేశామన్నారు. మరోవైపు రాష్ట్రంలోని 80 లక్షల హెక్టార్ల భూమిలో ప్రకృతి సేద్యం చేయనున్నట్టు తెలిపారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో మూడులక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని మూడులక్షల మంది రైతులు చేస్తున్నారని బాబు చెప్పారు. మరోవైపు ఈ ఏడాది సుమారు ఐదులక్షల ఎకరాల్లో ఐదు లక్షల మంది రైతులను ప్రకృతి సేద్యంలో భాగస్వామ్యులను చేయనున్నామని బాబు తెలిపారు.

ఐక్యరాజ్యసమితిలో ఏదైనా సమస్యల గురించి ప్రస్తావించేవారమన్నారు. అయితే ప్రకృతి సేద్యం గురించి తొలిసారిగా ప్రసంగించిన చరిత్ర ఏపీకి దక్కిందన్నారు. ప్రకృతి సేద్యం ఏ రకంగా మానవాళికి ఉపయోగమనే విషయాన్ని వివరించినట్టు బాబు తెలిపారు.