విజయవాడలో విషాదం: డ్రైన్ లో కొట్టుకుపోయిన ఆరేళ్ల బాలుడు
విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీలో ఇవాళ విషాదం చోటు చేసుకుంది. డ్రైన్ లో ఆరేళ్ల బాలుడు అభిరామ్ కొట్టకుపోయాడు.
విజయవాడ: నగరంలోని గురునానక్ కాలనీలో గల డ్రైన్ లో ఆరేళ్ల బాలుడు శుక్రవారంనాడు గల్లంతయ్యాడు. బాలుడి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.ఇవాళ ఉదయం విజయవాడ నగరంలో వర్షం కురుస్తుంది. దీంతో గురునానక్ కాలనీలో డ్రైన్ లో వరద నీరు పోటెత్తింది. వర్షం తగ్గిన సమయలో డ్రైన్ సమీపంలో ఆరేళ్ల బాలుడు అభిరామ్ స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు.ఈ సమయంలో ప్రమాదవశాత్తు అభిరామ్ డ్రైన్ లో పడిపోయాడు. ఆ సమయంలో డ్రైన్ లో వరద పోటెత్తింది. స్నేహితులు అభిరామ్ ను కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు కూడా డ్రైన్ లో కి దిగి అభిరామ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అభిరామ్ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు సంఘలన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ కార్పోరేషన్ నిర్లక్ష్యం కారణంగానే డ్రైన్ లో ఆరేళ్ల బాలుడు కొట్టుకుపోయాడని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆరోపించారు.
ఇదిలా ఉంటే విజయవాడ కార్పోరేషన్ మేయర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని మేయర్ ఆదేశించారు.మరో వైపు బాలుడు డ్రైన్ లో పడిన విషయం తెలిసిన వెంటనే బాలుడి తండ్రి స్పృహ కోల్పోయాడు.ఓపెన్ డ్రైయిన్ కారణంగా అభిరామ్ కొట్టుకుపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓపెన్ డ్రైన్ ను మూసివేయాలని కార్పోరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.