ఆంధ్రప్రదేశ్‌లో 45వ విడత ఫీవర్ సర్వే చేపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వేకు ప్రాధాన్యత సంతరించుకుంది. కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో ఈ సర్వే కీలక పాత్ర పోషించింది. తాజా సర్వేలో భాగంగా 1.6 కోట్ల కుటుంబాలపై ఆరా తీయనున్నారు. అనారోగ్యానికి గురైనవారికి చికిత్స అందించనున్నారు. కరోనా లక్షణాలుంటే టెస్టులు చేయనున్నారు.
న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయనే కథనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో విడత ఫీవర్ సర్వే చేపట్టింది. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలకు ఏ మాత్రం లక్షణాలు కనిపించినా.. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. టెస్టు చేసి హోం ఐసొలేషన్‌లో ఉంచడం లేదా ఇతర చికిత్స, సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 45వ విడత ఫీవర్ సర్వే కొనసాగుతున్నది. ఈ విడత సర్వేలో మొత్తం 1,63,37,078 కుటుంబాల వివరాలను సేకరించనున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 44 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ ఫీవర్ సర్వేల ద్వారా కొవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వం సఫలీకృతమైనట్టు తెలుస్తున్నది. ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి ఈ ఇంటింటి సర్వే చేపడుతున్నారు. ఆశా వర్కర్‌తోపాటు గ్రామ, వార్డు వాలంటీర్లు సోమవారం నుంచి ఇంటింటికి వెళ్లి జ్వర పీడితులు ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. ఎవరికైనా జ్వరం లక్షణాలుంటే వారికి కరోనా టెస్టులు చేయడానికి ఏఎన్ఎంతోపాటు మెడికల్ అధికారి దృష్టికి తీసుకెళ్తున్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారిలోనూ జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా హోం ఐసొలేషన్2కు సూచనలు చేస్తారు. అలాగే, ఉచిత మందుల కిట్ కూడా ఇస్తారు. వారిని వైద్యులు పర్యవేక్షిస్తారు.
దీర్ఘకాలిక జబ్బులు లేనివారిలో స్వల్ప జ్వర లక్షణాలు కనిపిస్తే వారికి అక్కడే మందులు ఇస్తారు. ఫీవర్ స ర్వేను పటిష్టంగా చేపట్టాలని రాష్ట్రం భావిస్తున్నది. నిబంధనల మేరకు పక్కాగా ఫీవర్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి.. జిల్లా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెలలో రెండు సార్లు ఫీవర్ సర్వే నిర్వహించాలని, ఈ నెలలో తొలి విడత సర్వే 17వ తేదీలోగా పూర్తి కావాలని అన్నారు. ఇతర రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇంటింటి ఫీవర్ సర్వేను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు.
