విజయవాడ:కృష్ణా జిల్లా పరిటాల ఎస్బీఐ‌లో క్యాషియర్ చేతి వాటం ప్రదర్శించి సుమారు కోటి రూపాయాలను కాజేసినట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం క్యాషియర్  పరారీలో ఉన్నట్టుగా తెలిసింది.

పరిటాల ఎస్‌బీఐ బ్యాంకులో  బంగారం తాకట్టు పెట్టి రైతులు రుణాలు తీసుకొన్నారు. ఈ సమయంలో క్యాషియర్ సుమారు 40 నకిలీ ఖాతాలను సృష్టించి కోటి రూపాయాలను  స్వాహా చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.

బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకొన్న రైతులు... రుణాలను చెల్లించేందుకు రావడంతో సర్వర్లు పనిచేయడం లేదని అధికారులు తిప్పి పంపుతున్నారని సమాచారం. అయితే నకిలీ ఖాతాలను సృష్టించి డబ్బులను కాజేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్ శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిసింది.