విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి సరిగ్గా 37 ఏళ్లు. హైదరాబాద్‌లోని రామకృష్ణా స్డూడియోలో 1982 మార్చి 21న మీడియా సమావేశంలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రామారావు ప్రకటించారు.

ఆ వార్త అప్పటికప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా క్షణాల్లో ఆంధ్ర దేశమంతటా పాకింది. ఆ తర్వాత మార్చి 29న మధ్యాహ్నం 2.30 గంటలకు తెలుగుదేశం పార్టీన స్థాపిస్తున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు.

హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభకు భారీగా జనం తరలివచ్చారు. మే 28న అన్నగారి పుట్టినరోజు నాడు తిరుపతిలో జరిగిన సభకు లక్షలాది మంది తరలిరావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.

ఆ తర్వాత తొమ్మిది నెలల పాటు చైతన్య రథంపై ఎన్టీఆర్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి, తన ప్రసంగాల ద్వారా కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు.

1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో బరిలో నిలిచిన టీడీపీ.. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లోనూ పోటీ చేసి 203 స్థానాలను దక్కించుకుని సంచలనం సృష్టించింది. తద్వారా రామారావు ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారు.